భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్ అంశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తమ ప్రాదేశిక సౌర్వభౌమత్వాన్ని అణగదొక్కే విధంగా ఉందని రుసరుసలాడింది. భారత్ తీసుకున్న తాజా ఏకపక్ష విభజన నిర్ణయం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ పేర్కొన్నారు. ఇలాంటి వివాదాలను భారత్, పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతం అని స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద ఘర్షణలు రేకెత్తించే చర్యలకు దూరంగా ఉండాలని తాము భారత్ ను కోరామని ఆమె వివరించారు. కాగా, భారత్ నిర్ణయంపై చైనా చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రస్తావించారు. భారత్ నిర్ణయాన్ని చైనా కడిగిపారేసిందని ఆవేశం ప్రదర్శించారు.
జమ్మూకశ్మీర్ పునర్విభజన, లఢఖ్ ప్రాంతాన్ని సరికొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తున్నట్టు రవీష్ కుమార్ వివరించారు. ఈ నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం అని చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. భారత్ పాలన పరమైన అంశాల్లో చైనా స్పందనలకు తావులేదని ఆయన చెప్పకనే చెప్పారు. భారత్ ఏ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని, వ్యాఖ్యలు చేయదని, ఇతర దేశాలు కూడా తన పట్ల అలాగే ఉండాలని భారత్ కోరుకుంటుందని రవీష్ కుమార్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.