శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్చార్జి అయిన నగరం వినుత ఇంటి మీద దాడి జరిగింది. రేణిగుంట వసుంధర నగర్ లో కాపురం ఉంటున్న నగరం వినుత ఇంటి పై మర్రిగుంట గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి దాడి చేసి ఇంటి అద్దాలను కారును ధ్వంసం చేసినట్టు సమాచారం. ఈ సంఘటనపై నగరం వినుత గాజులమండ్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా నగరం వినుత మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే శివ అనే వ్యక్తి మా పై దాడికి ప్రయత్నించాడని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న శివ పోలీస్ స్టేషన్ ఆవరణలో మాట్లాడుతూ నేను జనసేన కార్యకర్తనేనని నా సమస్యలపై మాట్లాడడానికి జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ నగరం వినుత ఇంటికి వెళ్లాలని వెళ్లానని అక్కడ ఆమె భర్త కోట చంద్రబాబుతో నా సమస్యను చెప్పానని సంబంధం లేకుండా కోట చంద్రబాబు నన్ను జాతి పేరుతో తిడుతూ బయటకు గెంటేశాడు అని అన్నారు. చాలాసేపు ఆరుబయటే ఉండి బ్రతిమాలి అన్నానని అయినా కూడా తన మాట లెక్క చేయక పోవడంతో ఆవేశానికి లోనై దాడి చేశానని తెలిపారు. దీనికి పార్టీలకు సంబంధం లేదని నాకు వారికి వ్యక్తిగత కారణాలవల్ల ఈ గొడవ జరిగింది అని అన్నారు. గాజులమండ్యం ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ ఇంటిపై దాడి జరిగిందని కోటా చంద్రబాబు, నగరం వినుత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పూర్తి విచారణ చేసి పై అధికారులకు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.