telugu navyamedia
క్రీడలు వార్తలు

పైన్‌‌ కు అశ్విన్ పంచ్…

ఓటమి బాధలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌‌ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు. గబ్బాలో భారత్ ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ పైన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్ ఆడకపోయినా.. సిడ్నీ టెస్ట్‌లో అసాధారణ పోరాటం చేశాడు. హనుమ విహారితో కలిసి ఆసీస్ భీకర బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచాడు. ఓవైపు వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతున్నా.. జట్టు కోసం నిలబడ్డాడు. ఈ క్రమంలో అశ్విన్‌పై పైన్ నోరుపారేసుకున్నాడు. భారత ఆటగాళ్ల ఆటను ఓర్వలేక స్లెడ్జింగ్‌కు దిగాడు. ‘నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్’అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. వీటికి అశ్విన్ కూడా తనదైన శైలిలో ‘మేము కూడా మిమ్మల్ని భారత్​లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్​ కావొచ్చు.’అని బదులిచ్చాడు. ఈ స్లెడ్జింగ్‌ను మనసులో పెట్టుకున్న అశ్విన్.. తాజా విజయానంతరం పైన్‌ పేరు ప్రస్తావించకుండానే చురకలంటించాడు. ‘గుడ్ ఈవ్‌నింగ్ గబ్బా!! ఈ మైదానం నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్‌ను ఎప్పటికీ మరిచిపోలేం’అని ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమ జట్టును తక్కువ అంచనా వేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లను అశ్విన్ ఎత్తిపొడిచాడు. అడిలైడ్‌లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చవిచూసిన తర్వాత, కోహ్లీ గైర్హాజరీలోని భారత జట్టు 4-0తో క్లీన్ స్వీప్‌కు గురవుతుందని ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు రికీపాంటింగ్, మార్క్ వా, మైఖెల్ క్లార్క్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు. అయితే సిరీస్ విజయానంతరం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను పంచుకున్న అశ్విన్.. ఇప్పుడేం చెబుతారు దిగ్గజాలంటూ నిలదీశాడు.

Related posts