ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో గెలుపొందడం, ఆ విజయంలో తాను కీలక పాత్ర పోషించడం తన జీవితంలోనే ఓ మధురమైన క్షణమని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ భారత రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ అసాధారణ బ్యాటింగ్‌తో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన రిషభ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సపోర్ట్ స్టాప్, సహచర ఆటగాళ్ల మద్దతు వల్లే ఇది సాధ్యమైందన్నాడు. ‘నా జీవితంలోనే ఇది ఓ అద్భుతమైన క్షణం. నేను బాగా ఆడకున్నా సపోర్ట్ స్టాఫ్, సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. ఆ ప్రోత్సాహంతోనే నేను రాణించగలిగాను. ఇది ఓ డ్రీమ్ సిరీస్. వాస్తవానికి టీమ్‌మేనేజ్‌మెంట్ ఎప్పుడూ నాకు అండగా ఉంది. తరుచూ నేనో మ్యాచ్ విన్నరని, వెళ్లి జట్టుకు విజయాలు అందించాలని చెబుతూ ఉండేది. నేను కూడా ప్రతీ రోజు భారత్‌కు విజయాన్నందించాలని ఆలోచించేవాడిని. అది ఈ రోజు జరిగింది. ఆటలో ఐదో రోజు బంతి టర్న్ అయింది. దాంతో నా షాట్ సెలెక్షన్‌లో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నాను’అని పంత్ చెప్పుకొచ్చాడు. 1988 తర్వాత బ్రిస్బేన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఆస్ట్రేలియాకు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని సాధించి.. సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ ట్రోఫీని నిలబెట్టుకుంది.
previous post
next post