రాజకీయాల్లో అజాత శత్రువు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు దేవరయాంజల్ లో నిర్వహించారు. రోశయ్య అంతిమ సంస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలు తో పూర్తిచేసింది.
రోశయ్య కోరిక మేరకు కుటుంబసభ్యులు కొంపల్లి వ్యవసాయక్షేత్రంలో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. రోశయ్య చితికి ఆయన పెద్ద కుమారుడు శివ సుబ్బారావు కొరివిపెట్టారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయానికి అక్కడ నివాళులర్పించారు. అమీర్ పేట నుంచి రోశయ్య పార్థివదేహాన్ని గాంధీ భవన్ కు అభిమానులు సందర్శనార్థం తీసుకొచ్చారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రోశయ్య పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
గాంధీభవన్ నుంచి హైదరాబాద్ శివార్లోని కొంపల్లి దేవరయాంజాల్ వ్యవసాయ క్షేత్రానికి పార్థివదేహాన్ని తీసుకొచ్చి, వైశ్య సాంప్రదాయానుసారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, సినీనటుడు చిరంజీవి, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి రోశయ్యకు నివాళులు అర్పించారు.