telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రధాని మోదీతో ముగిసిన జగన్ భేటీ..

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశం ముగిసింది. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆ త‌రువాత‌ గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా జిల్లాల విభజన, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి నిధులు, పెండింగ్ సమస్యలతో పాటు.. రాజకీయ పరిణామాల గురించి కూడా ప్రధానికి జగన్ వివరించినట్టు తెలుస్తోంది

అలాగే పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధాన మంత్రికి సీఎం నివేదించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు.

పోలవరం పూర్తి కావడానికి ఇంకా రూ.31,188 కోట్లు అవసరమని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు కేంద్రం ఇస్తున్న బిల్లులకు వ్యత్యాసం వుందని.. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపిక విధానం వల్ల ఏపీకి నష్టం జరుగుతోందని సీఎం చెప్పారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548 కోట్లు అందించాలని జగన్ కోరారు.

అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సైట్ క్లియరెన్స్ ఇవ్వాలని మోడీని కోరారు జగన్. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఇచ్చిన హామీ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీఎండీసీకి బీచ్ శాండ్ మినరల్స్ ప్రాంతాలు కేటాయించాలని జగన్ కోరారు. రాష్ట్రం తలపెట్టిన 12 మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని.. రెవిన్యూ గ్యాప్‌ను భర్తీ కోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నాటికి పెండింగ్‌ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసిందని.. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలని జగన్ కోరారు.

అయితే మరికాసేట్లో కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం జగన్​ కలవనున్నారు. విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts