telugu navyamedia
ఆంధ్ర వార్తలు

భ‌క్తులు అధిక ర‌ద్దీ ఎఫెక్ట్ : వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

టీటీడీ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని స‌ర్వ ద‌ర్శ‌న టిక్కెట్ కౌంటర్ల‌ వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 5 రోజుల పాటు వీఐపీ  బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని భ‌క్తులు  గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

టీటీడీ రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీ చేయలేదు. దీంతో ఇవాళ సర్వదర్శనం టికెట్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఈరోజు విడుదల చేసే సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్ వద్దకు బారులు తీరారు.

అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోవ‌డంతో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా చిన్నారులు, వయసు పైబడిన వాళ్లు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు.

మండుటెండల్లో వస్తున్న భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు . చంటిబిడ్డలతో వచ్చిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడటంతో టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

భ‌క్తులకు నేరుగా తిరుమ‌ల‌కు అనుమ‌తి..

అధిక ర‌ద్దీ కార‌ణంగా భ‌క్తులు నేరుగా తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు తెలిపింది. టోకెన్ల కేంద్రాల వ‌ద్ద టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి వెళ్ళ‌వ‌చ్చు అని తెలిపింది. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లగ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టీటీడీ తెలిపింది.

Related posts