ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేబినెట్‌లో చర్చించామని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే కాకినాడ ఎస్ఈజెడ్ పరిధిలో భూ సేకరణకు వ్యతిరేకించిన రైతులకు… భూమిని తిరిగి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2180 ఎకరాల భూమిని ఆ రైతులకే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు భూమిని తిరిగి ఇచ్చేయాలని జగన్ హామీనిచ్చారని… 2014కు ముందు ఆ భూముల్లో ఏరువాక సాగిస్తామన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆరు గ్రామాల్లో భూములను లాక్కొనే ప్రయత్నం చంద్రబాబు చేశారని.. ఆ ఆరు గ్రామాల భూములను వెనక్కిచ్చేశామన్నారు. ఆ ఆరు గ్రామాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించామని తెలిపారు. అలాగే 2700 వాహనాల ద్వారా మున్సిపాల్టీల్లో ఇంటింటికెళ్లి చెత్త సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై అధికారులకు టార్గెట్లు ఫిక్స్ చేస్తామన్నారు. మున్సిపాల్టీల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం ఈ బడ్జెట్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి