telugu navyamedia
రాజకీయ

ఆప్ఘన్‌లోని పరిణామాలతో ప్రపంచానికి మరో ముప్పు..!

తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్థాన్ పౌరులు ఆందోళనతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. దేశం విడిచి వెళ్లిపోవాలని అక్కడి పౌరులు చేస్తున్న ప్రయత్నాలతో జరుగుతున్న ఘటనలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ఆప్ఘన్ల గుండెలు అంతులేని దుఃఖ సాగరంలా మారాయి. ఆప్ఘనిస్థాన్‌లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలతో యావత్ ప్రపంచం ముందు కొత్త ప్రమాదం ముంచుకొస్తున్నట్టు తెలుస్తోంది. 20 ఏళ్లుగా మరుగునపడ్డ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ తాలిబన్ల సహకారంతో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడిచేసి మారణ హోమం సృష్టించింది అల్‌ఖైదా సంస్థ.

ప్రపంచమంతా ఆ ఘటనతో నిర్ఘాంతపోయింది. అగ్రరాజ్యం అమెరికాలో అదో చీకటి రోజు. ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రం ఆప్ఘనిస్థాన్. అమెరికా లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడిన ఈ సంస్థ ఆ ఘటనతోనే వెలుగులోకి వచ్చింది. అందుకే గత 20 ఏళ్లుగా ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా సాగించిన పోరు ఆల్‌ఖైదా లక్ష్యంగానే జరిగింది. అమెరికా పోరులో అల్‌ఖైదా దాదాపు నిర్వీర్యమైపోయింది. ఎక్కడా దాని కార్యకలాపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అక్కడినుంచి తమ దళాలను నిష్క్రమించాలన్న అమెరికా నిర్ణయంతో ఆప్ఘనిస్థాన్‌ తాలిబన్ల వశమైంది దీంతో మళ్లీ ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా క్రియాశీలకం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ హయాంలో అమెరికా ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేసిన క్రిస్‌ కోస్టా స్వయంగా అంగీకరించారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన నివేదిక కూడా ఆల్‌ఖైదా సీనియర్‌ నాయకత్వం ఆప్ఘనిస్థాన్‌లో ఇంకా క్రియాశీలకంగానే ఉందని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆప్ఘనిస్థాన్‌లో ఇప్పటికీ ఆల్‌ఖైదాకు సానుభూతిపరులు అనేకమంది ఉన్నారు. తాలిబన్ల దురాక్రమణతో ఆల్‌ఖైదా మళ్లీ క్రియాశీలమయ్యే ప్రమాదం ఉందని అమెరికా పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బే అంచనా వేశారు. ఆప్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొని తమ క్యాడర్‌ను
బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లోకి తమ భావజాలాన్ని విస్తరించడం, సానుభూతిపరులను తమవైపు తిప్పుకోవడం వంటి కార్యకలాపాలపై దృష్టిసారించే అవకాశం కనబడుతోందని పేర్కొన్నారు.

Related posts