ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అధ్వానపు చదువు అందుతోందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ విద్యాప్రమాణాలు మెరుగుపడకుండా ఎన్ని డబ్బులిచ్చినా ఉపయోగం లేదని తెలిపారు. “అమ్మఒడి” కావచ్చు, ఇంకేదైనా పథకం కావచ్చు వాటి ద్వారా పేదలకు ఎన్ని డబ్బులిచ్చినా సంతోషమే అన్నారు. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడతాయన్నది ముఖ్యమని జేపీ వ్యాఖ్యానించారు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదని చెప్పారు. అలాంటప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదని అన్నారు. దేశంలోని ప్రజల జీవితాలతో సంబంధం లేని రాజకీయం నడుస్తోందని, అల్లంతప్పుడు ఈ దేశంలో ఎవరు ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించే సంస్కారం మన పరిపాలనలో ఉందా అని ఆయన ప్రశ్నించారు.