కేరళలో మరో సమస్య తలెత్తింది. నిన్నటిదాకా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం మహిళలు పోటీ పడుతుండేవారు, అయితే ప్రస్తుతం కోర్టు దానికి అనుమతి ఇచ్చింది కాబట్టి, ఇక మసీదులలోకి కూడా మహిళలను అనుమతించాలని వారు కొత్త డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఇంకా శబరిమల సమస్యే ఒక కొలిక్కి రాకుండా, మరో సమస్యను పోలీసుల తలపై తయారయ్యింది. ఈ నేపథ్యంలోనే, కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శబరిమల దగ్గరే ఉన్న వావర్ మసీదులోకి వెళ్లేందుకు ముగ్గురు మహిళలు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఈ ముగ్గురిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. వీరంతా హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.
గతవారం మీడియా సమావేశం నిర్వహించిన ఈ ముగ్గురు మసీదులోకి వెళ్లితీరుతామని ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించినప్పుడు, మసీదులోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఈ ముగ్గురు మహిళలపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి కేరళలో మతగొడవలతో ఎవరో పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నట్టే ఉంది. ముందు వారిని నిలువరించాల్సి ఉంది.