telugu navyamedia
రాజకీయ

పద్మ అవార్డులు : ప్ర‌ధానికి న‌మ‌స్క‌రించిన 125 ఏళ్ల స్వామి శివానంద

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం ప్రదానం చేశారు.  2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రకటించిన అవార్డులను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం) సహా పలువురు ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించారు.

ఈ వ్యక్తులలో 125 ఏళ్ల స్వామి శివానంద పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. యోగా రంగంలో విశేష కృషి చేసినందుకు స్వామి శివానందకు ఈ గౌరవం లభించింది.  శివానంద బహుశా దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కారు. 

ఈ అవార్డును స్వీకరించడానికి స్వామి శివానంద సాధారణ కుర్తా-ధోతీలో చెప్పులు లేకుండా వెళ్లినప్పుడు అక్క‌డ ఉన్న‌వారంతా చప్పట్లు కొట్టారు.

అంతేకాకుండా ఈ వేడుకకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి స్వామి శివానంద మోకాళ్లపై నిలబడి అభివాదం చేశారు. వెంట‌నే ప్రధాని మోదీ కూడా స్వామి శివానంద ముందు వంగి నేలను తాకారు. ఆ త‌రువాత‌ రాష్ట్రపతి ముందు వంగి నమస్కరించారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద నమస్కరించిన తీరు భారతదేశ నిజమైన సంస్కృతికి నిదర్శనం అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

స్వామి శివానంద కాశీకి చెందినవాడు. ఆయ‌న 1896 ఆగస్టు 08న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న సైలెట్ జిల్లాలోని హరిపూర్ గ్రామంలో జన్మించారు. ఆరేళ్ల వయసులో తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయాడు .ఆ త‌రువాత అతన్ని పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లోని తన గురూజీ ఆశ్రమానికి తీసుకువచ్చారు. గురు ఓంకారానంద గోస్వామి ఆధ్వర్యంలో పెరిగారు.

స్వామి శివానంద నిరాడంబరమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఇప్పటికీ తన చుట్టూ పక్కల వారికి సేవ చేస్తున్నారు. ఆయన మూడు దశాబ్దాలకు పైగా కాశీ ఘాట్‌లలో యోగాభ్యాసం, శిక్షణ ఇస్తున్నారు.

Related posts