telugu navyamedia
రాజకీయ

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం  ఘనంగా జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రకటించిన అవార్డులను సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల్లో 128 పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు విడుతల్లో అవార్డుల ప్రదాన ప్రదానం చేశారు.

ఇందులో భాగంగా ఇవాళ దివంగత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం) పద్మవిభూషణ్‌.. 8 మందికి పద్మభూషణ్‌, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. తెలంగాణకు చెందిన12 మెట్ల కిన్నెర వాద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు పురస్కారాలను స్వీకరించారు. భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్‌ హుస్సేన్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన మనవడు షేక్‌ హిలమ్‌ షా ఉద్దీన్‌ అందుకున్నారు.

Related posts