కరోనా.. కరోనా.. కరోనా.. 2020 సంవత్సరం మొత్తంలో మనకు వినిపించిన మాట ఇదొక్కటే. అగ్రరాజ్యం.. పేద దేశం అనే తేడా లేకుండా, చిన్నా.. పెద్ద అనే భేదం లేకుండా ప్రపంచాన్ని కుదిపేసిందీ మహమ్మారి. 2020 పూర్తవుతున్నా కొవిడ్ మాత్రం కొత్త రూపాల్లోకి మారుతూ కోరలు చాస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గత 20ఏళ్లుగా జరిగిన ఆరోగ్య పురోగతిని ఈ మహమ్మారి తుడిచిపెట్టేస్తుందేమోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. అలా జరగకుండా ఉండాలంటే వచ్చే ఏడాది కొవిడ్ పోరుతో పాటు ఆరోగ్య పరమైన ఇతర అంశాలపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని నొక్కిచెబుతోంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొంది. ఈ మేరకు దేశాలకు పలు సూచనలు చేసింది.
★ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు 2021లో ప్రపంచదేశాలన్నీ వ్యాక్సిన్లను, మందులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా వైరస్ పరీక్షలను సమర్థంగా నిర్వహించాలి.
★ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సురక్షితంగా ఉండేంత వరకు ఎవరూ క్షేమంగా ఉన్నట్లు కాదు. ప్రపంచవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య భద్రత కోసం దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలి.
★ అన్ని దేశాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు వచ్చే ఏడాది డబ్ల్యూహెచ్‌వో తన భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. మహమ్మారిని తరిమికొట్టేందుకు మనకున్న మెరుగైన అవకాశం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థే. అత్యవసర ఆరోగ్య సేవలను ప్రతి పౌరుడికి అందించేలా దేశాలు చర్యలు తీసుకోవాలి.
★ఆరోగ్యరంగంలో అసమానతలకు తావివ్వకూడదు. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగ వివక్షత ఇలా ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్యసేవలు సమానంగా అందించేలా దేశాలు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలి.
★అంటువ్యాధులు కాని రోగాలపై కూడా దృష్టిపెట్టాలి.
డబ్ల్యూహెచ్‌వో తాజా గణాంకాల ప్రకారం.. గతేడాది మరణానికి దారితీసే 10 వ్యాధుల్లో ఏడు ఇలాంటి తరహా అనారోగ్యాలే ఉన్నాయి. అందుకే గుండెపోటు, క్యాన్సర్, డయాబెటిస్ లాంటివాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఇలాంటి అనారోగ్యాలతో బాధపడేవారు కరోనా మహమ్మారి బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
★పోలియో, హెచ్‌ఐవీ, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను తరిమికొట్టేందుకు డబ్ల్యూహెచ్‌వో గత కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా కృషి చేస్తోంది. అయితే 2020లో ఈ పరిశోధనలకు కొవిడ్ 19 ఆటంకం తెచ్చింది. అందుకే 2021లో వీటిపై మళ్లీ దృష్టిపెట్టాల్సిన అవసరం వచ్చింది. పొలియో, ఇతర వ్యాధులకు వ్యాక్సిన్లు తెచ్చేందుకు డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలకు పూర్తి సహకారం అందిస్తుంది.
★ ఇక ఈ ఏడాది కరోనా తెచ్చిన లాక్‌డౌన్ కారణంగా ప్రజల్లో ఆర్థిక అభద్రత, భయం, అనిశ్చితి పెరిగింది. ఇవి వారి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మానసిక ఆరోగ్యంపై దేశాలు మరింత దృష్టి సారించాలి. ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మనోధైర్యం కల్పించేలా దేశాలు కృషిచేయాలి.
★ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశాలు, సంస్థలు, మనుషుల మధ్య పరస్పర సౌభ్రాతృత్వం ఉండాలి. అదే స్ఫూర్తితో కలిసికట్టుగా ఉండి కరోనాను తరిమికొట్టాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
తన ఆరోగ్యంపై అమితాబ్ షాకింగ్ కామెంట్స్