స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి పార్టీ మారిన మహిళా ఎమ్మెల్యే.. రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలలో ఇల్లెందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆమె ఇటీవలే తెరాసలో చేరడం తెలిసిందే.
తెరాస తరఫున ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న లకావత్ సునీత, జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న కేళోత్ భాస్కర్‌నాయక్‌లకు ప్రచారం చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు ప్రచార వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. వాహనం ముందుకు వెళ్తుండగా తెరాస, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసి కొట్టుకున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అడ్డుకుని సర్దిచెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రచారాన్ని కొనసాగించారు. సమాచారం తెలిసిన ఖమ్మం గ్రామీణ ఏసీపీ రామోజీ రమేశ్ గోవింద్రాలను సందర్శించారు. గొడవలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమాయక గిరిజన ప్రజలను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగానే కొందరు నాయకులు తనపై దాడి చేయించారని ఎమ్మెల్యే హరిప్రియ ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ ఎక్కడా ఆందోళనలు జరగడం లేదని, గిరిజన మహిళ కావడంతోనే తనపై దాడులు చేస్తున్నారన్నారు.
రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం: పవన్ కల్యాణ్