వలపు తలపుల సమీరమై-
నా ప్రేమ జీవనానికి
మహిమాన్విత శరవ్యమై-
నా హృదిలో పరిమ్లానము కాని
శాశ్వత పుష్పమై –
ప్రబంధ నాయిక లైన
“వరూధినీ” విరహం,
“గిరికా దేవి” కలపిక స్వనం,
“రాధ” నాసికాకృతిలో హల విన్యాసం,
ముమ్మూర్తులా నీలో నింపుకున్న
ఓ సౌందర్య లహరీ!
నా ప్రణయ ఝరీ!
వనమయూరీ!
ఎన్ని జన్మల బంధమో,
యుగ యుగాల పూజాఫలమో,
మన రెండు హృదయాల్లో
ప్రేమ వసంతం-
ఇలలో ప్రతి నిమిషం
వలపు నావలో విహారం-
నాకోసం ఉదయించిన
నవనవోన్మేషమా!
నీతోనే నా శ్వసితం –
నీ తోనే నా సమస్త జీవితం-
నీవు నా ప్రణయ సుగంధం
నీవే నా ప్రేమామృత బంధం
-అంశుమాలి, టెక్కలి