telugu navyamedia
తెలంగాణ వార్తలు

న‌కిలీ విత్త‌నాల‌పై ఉక్కుపాదం మోపింది టీఆర్ ఎస్ స‌ర్కారే – కేసీఆర్‌

హైద‌రాబాద్‌ తెలంగాణ‌లో న‌కిలీ విత్త‌నాలపై ఉక్కుపాదం మోపింది టీఆర్ ఎస్ స‌ర్కారేన‌ని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా న‌కిలీ విత్త‌నాల అమ్మ‌కందారుల‌పై పీడీ యాక్ట్ పెట్టిన రాష్ట్రం తెలంగాణేన‌ని తెలిపారు.

అంతేకాకుండా రైతుల‌కు 24 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మే కాకుండా, పెట్టుబ‌డి సాయం కింద రైతుబంధు, రైతు బీమా వంటి ప‌థ‌కాల‌ను తీసుకురావ‌డం ద్వారా వ్య‌వ‌సాయ స్థిరీక‌ర‌ణ జ‌రిగింద‌న్నారు. గ‌తంలో విత్త‌నాలు స‌రిగ్గా దొరికేవి కావ‌ని, విప‌రీత‌మైన క‌ల్తీ విత్త‌నాలు ఉండేవ‌ని కేసీఆర్‌ గుర్తు చేశారు.

మొత్తం దేశంలో కేంద్రంతో కొన్ని నెల‌ల‌పాటు కొట్లాడి, ఒప్పించి క‌ల్తీవిత్త‌నాలు అమ్మిన‌వాళ్ల‌పై పీడీ యాక్ట్‌ను దేశంలో తీసుకొచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఏర్పడ‌క ముందు రైతాంగానికి ఎరువులు కావాలంటే రోజుల త‌ర‌బ‌డి లైన్ల‌లో ఉండ‌టం, గొడ‌వ‌లు ప‌డ‌టం, చివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ల‌లో ఎరువుల బ‌స్తాలు పెట్టి అమ్మిన ప‌రిస్థితులు కూడా చూశామ‌ని ఆయ‌న గుర్తుచేశారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై చ‌ర్చించారు.

Related posts