telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్‌తో ఆడేటప్పుడు అది పెద్దగా లెక్కలోకి రాదు : బౌల్ట్‌

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత్, న్యూజిలాండ్‌ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌పై గెలుపొందాక న్యూజిలాండ్‌ జట్టు మంగళవారం సౌథాంప్టన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ట్రెంట్‌ బౌల్ట్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో భారత్‌తో ఆడేటప్పుడు ఇంగ్లండ్‌పై సాధించిన టెస్ట్ సిరీస్‌ విజయం పెద్దగా లెక్కలోకి రాదని నేను అనుకుంటున్నా. మా ఆటగాళ్లు బాగా సన్నద్ధమయ్యేందుకు అది ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగపడింది. భారత్ బలమైన జట్టు. అందుకే నేను అలా భావిస్తున్నా. ఇక కోహ్లీసేనతో ఫైనల్లో తలపడేందుకు నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఫైనల్లో మేం మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా. తొలిసారి జరుగుతున్నా డబ్ల్యూటీసీ ఫైనల్‌ గెలిస్తే.. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది’ అని అన్నాడు. ‘నేను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఆడటం వల్ల భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు తెలిసిన వాళ్లు ఉంటారు. అయితే నేను ఆడే ముంబై ఇండియన్స్‌ జట్టులో ఇప్పటివరకు ఒక్కర్ని కూడా చూడలేదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తుండటం వల్ల నేను వారిని చూడలేదేమో. అయితే ఫైనల్లో మా రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొని ఉంటుందని భావిస్తున్నా’ అని కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ చెప్పుకొచ్చాడు.

Related posts