telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 20 నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్మాణమైన సమీకృత కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభిస్తారు. వరంగల్‌లో నిర్మించనున్న మల్టీలెవల్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ప్రత్యక్షంగా తెలుసుకొంటారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతారు. అధికారులు ఎంపికచేసిన గ్రామాలే కాకుండా అప్పటికప్పుడు గ్రామాలను ఎంపికచేసుకొని ఆకస్మికంగా తనిఖీ చేస్తారు.

 

సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం

జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఈనెల 20న ఉదయం సిద్దిపేట జిల్లాకేంద్రానికి వెళతారు. అక్కడ నిర్మాణం పూర్తయిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. మధ్యాహ్నానికి కామారెడ్డి వెళతారు. అక్కడ సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించి, ఆ జిల్లాలోని గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ చేపడుతారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభత్ర, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలను పరిశీలిస్తారు. రాష్ట్రప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధుల వినియోగాన్ని పరిశీలిస్తారు. ఆ నిధులు దేనికి ఖర్చు చేస్తున్నారో అడిగి తెలుసుకుంటారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, మిషన్‌భగీరథ నీరు ఇంటింటికి వస్తున్న తీరును ప్రత్యక్ష్యంగా తనిఖీ చేస్తారు. గ్రామంలో ఆసరా, రైతుబంధు తదితర పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకుంటారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలిస్తే అప్పటికప్పుడే చర్యలు తీసుకుంటారు. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అకస్మిక తనిఖీలు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.

Related posts