హైదరాబాద్ నగరంలో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి కొన్నింటిని సీజ్ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానాలువిధించారు. ముషీరాబాద్‌లోని బావర్చీ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు కూకట్‌పల్లి సర్కిల్ నిజాంపేట్‌లోని సహారా కేఫ్ రెస్టారెంట్‌లో అపరిశుభ్రంగా కిచెన్ నిర్వహించడంతో సీజ్ చేశారు.
వ్యర్థాలను డ్రైనేజీలో వేయడం, సిల్ట్ చాంబర్‌లను నిర్మించుకోకపోవడంతో త్రిపురా బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.20వేల జరిమానాను విధించారు. మూసాపేట సర్కిల్‌లోని దేవి గ్రాండ్ హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, ధ్రువీకరించని మాంసం ఉపయోగించడం, డ్రైనేజీలో వ్యర్థాలను వేయడం తదితర కారణాలతో రూ. 30,100 జరిమానాగా విధించారు. వ్యర్థపదార్థాల నిర్వహణ చట్టం అనుసరించి 50కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు తప్పనిసరిగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు సూచించారు.