ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేపుతున్నాయి తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో పాటు ఏపికి అన్యాయం చేశారని ..కాగా ఆ ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని మోదీ అన్నారు.
దీంతో మోదీ వ్యాఖ్యలను తప్పుబడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార టీఆర్ఎస్ నేతలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మోదీపై రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజల పట్ల నరేంద్ర మోడీకి చిన్న చూపు ఉందని, అందుకు మరోసారి మోది తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కారని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధమౌతోందని అన్నారు.
అన్ని ప్రాంతాలను సమాన దృష్టిలో పెట్టుకుని ప్రసంగం చేయాల్సిన మోదీ ఏకపక్షంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.ప్రధాన మంత్రుల ప్రసంగాలు దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండే విధంగా గత ప్రధాన మంత్రులు మాట్లాడితే మోది మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.
మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రిననే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని, తానింకా గుజరాత్ సీఎంననే భావనలోనే ఆయన ఉన్నారని రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడిన మోదీకి బీజేపీ సీన్ ఎంటో తెలుసా? అసలు తెలంగాణ ఎందుకొచ్చిందో మోదీకి ఎరుకేనా? అని రేవంత్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామి మేరకు, ఇచ్చిన మాటలకు కట్టుబడి, 2009లో విస్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని ,
సోనియా గాంధితోపాటు కాంగ్రెస్ పార్టీ అనేక త్యాగాలు చేసి తెలంగాణ ఇస్తే… ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.రాష్ట్రాల ఏర్పాటుతోపాటు ఏదైనా బిల్లులు పాస్ చేసేటప్పుడు పార్లమెంట్ తలుపులు మూసి ఓటింగ్ నిర్వహిస్తారని, కాని ఇది తెలిసికూడా ప్రధాని మోదీ ఆయన రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని మోదీ ఇప్పుడు నీతులు చెబుతున్నారని, పోరాటాలు చేసి మోడీ ప్రధాని కాలేదన్నారు. మేనేజ్‌మెంట్ స్కిల్స్ తో మోడీ ప్రధాని అయ్యారని ఆయన మండిపడ్డారు. గుజరాత్ కు సీఎంగా అయ్యాక తన గురువైన అద్వానీకే నరేంద్ర మోడీ పంగనామాలు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నమ్మినవాళ్లను నట్టేట ముంచడంలో నరేంద్ర మోడీని మించిన వారెవరూ కూడా ఉండరన్నారు.
1999లోనే తెలంగాణ ప్రాంతంలో భాజపా 4 ఎంపీ సీట్లు గెలిచిందన్న ఆయన… తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి వాజ్‌పేయి మోసం చేశారన్నారు. వాజ్‌పేయి 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండిచేయి చూపారని గుర్తుచేశారు.
ఎన్డీఏ తొలి ప్రభుత్వమే తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే వందలమంది ప్రాణాలు పోయేవి కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. వందలమంది ఆత్మబలిదానాలకు ఒక రకంగా భాజపాయే కారణమని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మరోవైపు బిల్లు సంధర్భంగా చర్చ పెట్టాలని కోరినప్పుడు బీజేపీ పక్ష నేతగా ఉన్నా సుష్మాస్వరాజ్ అసలు చర్చలే అవసరం లేదు.. ఓటింగ్ నిర్వహించాలంటూ చెప్పారని, దీంతో అరుణ్ శౌరి, వెంకయ్యనాయుడు లాంటీ నేతలు చాలా కసరత్తు చేశారని అన్నారు.
హామీలను నెరవేర్చే దిశగా పని చేద్దాం: హరీశ్ రావు