telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

కిలో రూపాయికి పడిపోయిన .. టమోటా ధర.. రోడ్డుపై పడేసిపోతున్న రైతులు..

tomato prices drastically decreased

నిన్నమొన్నటి వరకు ఆకాశంలో ఉన్న టమోటా ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. దీనితో రైతులకు మరోసారి కడుపుకోత మిగిలింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో వరుసగా రెండవ రోజు కూడా టమోటా ధర పడిపోయింది. మధ్యాహ్నం 10 కిలోల టమోటా గంప రూ.300 నుంచి రూ.400లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. సాయంత్రానికి సీన్ మారింది. ధర అమాంతం రూ.30కి పడిపోయింది. అంటే కిలో రూపాయి. దీంతో టమాటా రైతుల కడుపు మండింది. వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. మరీ ఇంత దారుణమా అని వాపోయారు. దిక్కుతోచని స్థితిలో.. టమోటాలు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. టమోటా ధర తగ్గడంపై రైతులు ఆందోళనకు దిగడంతో.. వాటిని కొనుగోలు చేస్తామని అధికారులు నచ్చజెప్పారు. మార్కెటింగ్‌ శాఖ జేడీ సుధాకర్ మార్కెట్‌ యార్డు ఆవరణలో మిగిలిపోయిన టమోటాలను వ్యాపారులతో కొనుగోలు చేయించారు. తర్వాత మధ్యాహ్నం నుండి మార్కెట్‌కు మిగతా రైతులు టమోటాలు తీసుకొచ్చారు. ధర తగ్గిందని రూ.30కే కొంటామని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. ధర తగ్గించిన వ్యాపారులతో గొడవకు దిగారు. 50 టన్నుల టమోటాలను మార్కెట్‌లో పారబోసి నిరసన తెలిపారు.

సాయంత్రం మరింత మంది రైతులు లారీల్లో టమోటాలను మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చారు. ధర తగ్గిపోయినట్లు తెలుసుకుని నిరాశకు గురయ్యారు. మార్కెట్‌ యార్డులో టమోటా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా 5 లారీల సరుకు నిలిచిపోయింది. కొనుగోలుదారుల కోసం రాత్రి 7 గంటల వరకు రైతులు ఎదురు చూశారు. కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో యార్డులో టమోటాలు అలాగే నిలిచిపోయాయి. ఆరుకాలం శ్రమించి పండించిన టమోటా పంటను కిలో కనీసం రూ.10 కూడా నిర్థారించకపోవడంతో రైతులు కంటతడి పెట్టారు. కన్నబిడ్డలా సాకిన పంటను నడిరోడ్డుపై పారేశారు. కొంతమంది రైతులు సొంతూళ్లకు వెళ్లేందుకు డబ్బు లేక అవస్థలు పడ్డారు. కర్నూలు జిల్లా టమోటా పంటకు ఫేమస్. జిల్లాలోని 50వేల ఎకరాల్లో ప్రధాన పంట టమోటా . పత్తికొండ మార్కెట్ లోకి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తుంటారు. కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు వాటిని సప్లయ్ చేస్తారు. సుమారు 200 టన్నుల టమోటా రోజూ మార్కెట్ కి చేరుతుంది.

Related posts