telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ నేతల ఆందోళన బాట..రేవంత్ సహా కీలక నేతల హౌస్ అరెస్ట్

తెలంగాణలో చమురు, గ్యాస్, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర‌స‌న‌కు పిలుపునిచ్చింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టదించాలని నిర్ణయించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల‌కు నిరసనగా హైద‌రాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు.

ఈ నేప‌థ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పెద్దసంఖ్యలో పోలీసులు చుట్టూ ముట్టారు. ఇంధన ధరలతో పాటు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించడం, ధాన్యం కొనే దాకా కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని రేవంత్‌ నిన్న వెల్లడించారు.

రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనలకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే నేతలను అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంటి వైపు ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు.

ఒకవేళ పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఇంటి నుండి బయటకు వస్తే పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంది.

ఇవాళ విద్యుత్‌సౌధ, సివిల్‌ సప్లయిస్‌ భవన్‌ల ముట్టడికి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

Related posts