telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ అసెంబ్లీ దేశానికి ఆదర్శం..

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి ఏడేళ్ళు అయిన‌ప్ప‌టికీ శాస‌న‌స‌భ‌ సమావేశాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలివ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. బీఏసీ స‌మావేశం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌ అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని అధికారుల‌కు సీఎం సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరువ కావాల‌ని ఆకాంక్షించారు. అర్థవంతమైన, ముఖ్యమైన అంశమైతే ఎక్కువ సమయం ఇవ్వాలని, కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలని సూచించారు.

అధికార ప‌క్ష సభ్యుల కంటే విపక్షాలకు ఎక్కువ సమయం ఇస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు శాసనసభ నిర్వహించాలని.. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు, ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు..

ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంచాలి…జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని… ప్రభుత్వం తరఫున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం సూచనలు చేశారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్లబ్ నిర్మిస్తామని, ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ తరహాలో క్లబ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేధికగా ప్రజలకు చేరవేయాలన్నారు.

కాగా.. అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలను అక్టోబ‌ర్ 5వ‌ర‌కు కొన‌సాగించాల‌ని శాసనసభ వ్యవహారాల సలహా సంఘంలో (బీఏసీ) నిర్ణయించారు.

Related posts