తెలంగాణకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి కావాలంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు అలంపూర్ జోగులాంబకు మొక్కు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు, వనపర్తి జిల్లా చందాపూర్‌కు చెందిన 25 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు మంగళవారం జోగులాంబకు 1,016 టెంకాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హరీశ్ రావును తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులను పక్కనపెట్టి పక్క పార్టీలోంచి వచ్చిన వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌ను చూసి ఎవరూ ఓట్లు వేయలేదని, పనితీరును చూసే ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. పార్టీ నుంచి హరీశ్‌ను, మంత్రి ఈటల రాజేందర్‌ను బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కళ్లు తెరిపించాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు.