చట్టసభల ప్రతినిధులు అనే స్పృహలేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా మాట్లాడిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు
రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు
ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తామన్న స్పీకర్ .. ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇకపోతే.. వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.
తాజాగా వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. గత శుక్రవారం మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలో ప్రవేశించింది.
ఈ సందర్భంగా గతంలో నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఘాటు విమర్శలు చేశారు. తాను నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తుంటే.. నిరంజన్ రెడ్డి తనను మంగళవారం మరదలు అన్నారని గుర్తుచేసుకున్న షర్మిల.. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అని అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కార హీనుడు నిరంజన్ రెడ్డి అని అన్నారు. . ఆయనకు కుక్కకు ఏమైనా తేడా ఉందా అని మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికార మదం తలకెక్కిందా… నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మెట్టు (చెప్పు) దెబ్బలు పడతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. యువత హమాలీ పని చేసుకోవాలని, రైతులు వరి వేసుకోవద్దని చెప్పే నువ్వు ఒక మంత్రివా? అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలపై స్పీకర్ కు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలిస్తుంది.