telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కివీస్ క్లీన్ స్వీప్… మూడో వన్డేలోనూ గెలుపు వాళ్ళదే…!

Cricket

ఇండియాతో బే ఓవల్‌ మైదానంలో జరిగిన చివరి వన్డేలోనూ ఆతిథ్య కివీస్‌ 5 వికెట్లతో మ్యాచ్‌ గెలిచి, సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 297 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్‌ మరో 17 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ రీచ్‌ అయింది. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్‌(103 బంతుల్లో 80: 9 ఫోర్లు) ఇన్నింగ్స్‌కు అద్భుత ఆరంభాన్నిచ్చారు. మార్టిన్‌ గప్టిల్‌ ఆరంభం నుంచే ఇండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అతడి ధాటికి 29 బంతుల్లోనే అర్ధసెంచరీకి చేరుకున్నాడు. వీరిరువురూ తొలి వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్‌ విడదీశాడు. అద్భుత బంతితో గప్టిల్‌ను ఔట్‌ చేశాడు. గప్టిల్‌ నిష్క్రమణ తర్వాత.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ (22) నికోల్స్‌కు సహకరించాడు. ఈ దశలో చాహల్‌ భారత్‌కు మరోసారి బ్రేకిచ్చాడు. చాహల్‌ బౌలింగ్‌ షాట్‌ ఆడబోయిన కేన్‌.. మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ (12) జడేజా బౌలింగ్‌లో కెప్టెన్‌ విరాట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ స్థితిలో భారత్‌.. కివీస్‌కు గట్టి పోటీనిచ్చింది. 186 పరుగుల వద్ద 3 వికెట్‌ కోల్పోయిన కివీస్‌.. 189 పరుగులకు 4వ వికెట్‌ కోల్పోయింది. సెంచరీకి చేరువవుతున్న హెన్రీ నికోల్స్‌ను షార్దూల్‌ ఠాకూర్‌ ఔట్‌ చేశాడు. చివర్లో గ్రాండ్‌హోమ్‌ (28 బంతుల్లో 58: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడికి టామ్‌ లాథమ్‌ (32) చక్కటి సహకారమందించాడు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌ 3 వికెట్లతో రాణించాడు. షార్ధూల్‌ ఠాకూర్‌, జడేజా తలో వికెట్‌ పడగొట్టారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. 8 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (1) మరోసారి నిరాశపరిచాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (9) బెన్నెట్‌ బౌలింగ్‌లో జెమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి, మరోసారి విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చి యువ సంచలనం శ్రేయాస్‌ అయ్యర్‌ (63 బంతుల్లో 62: 9 ఫోర్లు) మరోసారి ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడాడు. పృథ్వీ షా ఔటయిన అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన ైస్టెలిష్‌ బ్యాట్స్‌మెన్‌ లోకేష్‌ రాహుల్‌ (113 బంతుల్లో 112: 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. అతడికి మానిష్‌ పాండే (42) సహకరించాడు. రాహుల్‌ సెంచరీ అనంతరం, భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. తదుపరి బంతికే పాండేను కూడా ఔట్‌ చేశాడు బెన్నెట్‌. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో బెన్నెట్‌ 4 వికెట్లు తీసి, భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను శాసించాడు. జమీసన్‌, జిమ్మీ నీషమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మరోవైపు వికెట్లు పడుతున్నా.. అద్భుతంగా రాణించిన హెన్రీ నికోల్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా ఎంపికయ్యాడు. సిరీస్‌ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇండియా సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో తొలుత టీ 20 సిరీస్‌ను 5-0తో వైట్‌వాష్‌ చేయగా… అందుకు బదులుగా కివీస్‌ 3-0తో ఇండియాను వైట్‌వాష్‌ చేసి, ప్రతీకారం తీర్చుకుంది. ఇరుజట్లు తలపడే టెస్టు సిరీస్‌ ఈ నెల 21 నుంచి ప్రారంభమవనుంది.

Related posts