telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ : మోడీ వర్సెస్ కేజ్రీవాల్… 2024 పోరుకు…!?

Modi-vs-Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద ఇవాళ దర్శనమిచ్చిన ఓ పోస్టర్… వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో మరో ఆసక్తిక పోరుకు తెరలేవనుందా? వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠంపై ఎక్కబోతున్న ఆమాద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారా? అనే ఊహాగానాలకు తెర తీస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగాలని కోరుతూ ఆమాద్మీ పార్టీ అభిమాని ఒకరు ఈ పోస్టర్ ప్రదర్శించారు. ‘‘2024: కేజ్రీవాల్ వర్సెస్ మోదీ’’ అని ఆ పోస్టర్లో రాశారు. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికలు కూడా జాతీయ ప్రయోజనాలు, స్థానిక సమస్యల మధ్య పోటీ అన్నట్టు సాగడంతో… ‘‘నరేంద్ర మోదీ వర్సెస్ కేజ్రీవాల్’’ అన్నట్టునే హోరాహోరీ పోరు నడిచింది. ఢిల్లీలో ప్రభుత్వానికి పూర్తిస్థాయి అధికారాలు లేకపోయినా.. కేవలం 70 స్థానాలు మాత్రమే ఉన్నా… ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాస్తవానికి 2013లో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా కేజ్రీవాల్ చెక్ పెట్టిన నాటి నుంచే మోదీకి, ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చేయగా.. అదే నియోజకవర్గం నుంచి మోదీపై కేజ్రీవాల్ పోటీ చేశారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీరిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమాద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేయగా.. బీజేపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. ఆమాద్మీ పార్టీకి ఏకంగా 54 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఆమాద్మీ పార్టీ విజయభేరి మోగించడంతో కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరమీదికి తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

Related posts