telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

అంబులెన్సు కోసం చూసి చూసి శ్వాస ఆగిపొయి…

Ambulance

అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కరోనాతో ఆరోగ్యం విషమించి అంబులెన్స్ కోసం 15 గంటల పాటు వేచి చూసిన ఓ వృద్ధుడు చివరకు ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంగళవారం జరిగింది. పట్టణంలోని రాజీవ్ నగర్ కు చెందిన ఓ వృద్ధుడు (75) అనారోగ్యంతో బాధ పడుతుండటంతో కుటుంబీకులు ఈ నెల 14న స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అయితే ఫలితం మాత్రం వారం దాటినా రాలేదు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలన్న ముందు కరోనా పరీక్ష తప్పనిసరి కావడంతో ఇంట్లోనే ఉండి పోవాల్సి వచ్చింది. ఈ లోగా వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించింది. సోమవారం మధ్యాహ్నం అతడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. వైద్యాధికారులు ఫోన్ చేసి అరగంటలో వస్తామని, కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి గంటల తరబడి వేచిచూసినా అంబులెన్సు రాలేదు. వృద్ధుడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో రాత్రి మరోసారి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా వాళ్ళు పట్టించు కోలేదు. ప్రైవేట్ అంబులెన్సు కోసం ప్రయత్నించినా కోవిడ్ భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మంగళవారం వారం తెల్లవారుజామున వృద్ధుడు మృతి చెందాడు. సకాలంలో అంబులెన్సు వచ్చి ఉంటే బతికే వాడని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకుని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అంత్యక్రియల నిర్వహణకు పారిశుద్ధ్య సిబ్బందిని పంపారు. చివరికి శ్మశానంలో కూడా కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించొద్దని స్థానికులు అడ్డుకోగా పోలీసుల సాయంతో కార్యక్రమం ముగించారు.

Related posts