కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 22 న ప్రజలు స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. 22న రాజ్ భవన్ లో కూడా ‘జనతా కర్ఫ్యూ’ నిర్వహిస్తామని చెప్పారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పౌరులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
విదేశాల నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాజ్ భవన్ లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామని అన్నారు.విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ‘కరోనా’ వ్యాపించిందని, తెలంగాణలో ఎవరికి ఈ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్య పరిచేందుకు ‘కరోనా’పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు.