telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

10 వేల సాయం అడ్డుకున్న వారికి ఉసురు తగులుతుంది

పేదప్రజలకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీని అడ్డుకున్న పాపం, ఉసురు తప్పక తగులుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులలో ఉన్న పేద ప్రజలకు భారీ వర్షాలతో మరిన్ని సమస్యలు తోడయ్యాయని పేర్కొన్నారు. కష్టాలలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉండాలి, వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముంపునకు గురైన ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించి అందజేశారని వివరించారు. 108 సంవత్సరాల తర్వాత ఎవరూ ఊహించని విధంగా భారీ వర్షం కురిసి ప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి సహాయం అందించాల్సిన కేంద్రప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సహాయాన్ని అందించలేదని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, డిల్లీ, ఓడిస్సా తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సహాయాన్ని అందించి అండగా నిలిచాయని తెలిపారు. చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయం అందించిన దాఖలాలు లేవని ఆయన చెప్పారు. మీ సేవ కేంద్రాల ద్వారా నేటి వరకు 1.65 లక్షల మండి దరఖాస్తు చేసుకున్నారని, వారందరికి బ్యాంకు ఖాతాల లో 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ఎదుట కనిపిస్తున్నాయని, ప్రజలలోకి తాము చేసిన అభివృద్ధి పనులతో వెళతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలు మానుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. గత GHMC ఎన్నికలలో 150 స్థానాలలో TRS పోటీ చేసి 99 స్థానాలను గెలుచుకున్నామని, ఈ సారి 104 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Related posts