ఏడేళ్ల బాలిక ప్రాణాలను ఉయ్యాల బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. దివ్యాంగుడైన వలపర్ల రవికుమార్, కవిత దంపతులు సత్తుపల్లి సిటీలోని ఎన్‌వీఆర్ కాంప్లెక్స్ రోడ్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి స్వర్ణిక (7), సాత్విక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. రవికుమార్ సిటీలోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బడ్డీకొట్టు నడుపుతుండగా.. కవిత జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తోంది. గురువారం (ఏప్రిల్ 23) మధ్యాహ్నం పిల్లలకు అన్నం పెట్టిన అనంతరం కవిత.. భర్తతో కలిసి టీవీ చూస్తూ భోజనం చేస్తోంది. ఆ సమయంలో వారి పెద్ద కుమార్తె స్వర్ణిక..ఇంటి బయట చీరతో చెట్టుకు కట్టిన ఊయలలో కూర్చొని ఆడుటకుంటోంది. ఊయలలో గుండ్రంగా తిరుగుతుండగా..ఒక్కసారిగా ఆ చీర బాలిక మెడకు చుట్టుకొని బిగుసుకుపోమయింది. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచింది. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.