telugu navyamedia
సినిమా వార్తలు

క్యూనెట్ స్కాం : అల్లు శిరీష్, పూజాహెగ్డేలకు నోటీసులు

Qnet Scam,Pooja Hegde,Allu Sirish
మల్టీ లెవెల్ మార్కెటింగ్ “క్యూనెట్” కేసులో ఈ సంస్థకు అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలెబ్రెటీలకు నోటీసులు పంపించినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. జనవరి తొలి వారంలో 14 కేసుల్లో 58 మందిని అరెస్టు చేసి ఆ కంపెనీకి చెందిన బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.2.7 కోట్లు ఫ్రీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విహన్‌ డైరెక్ట్‌ కంపెనీ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ జాబితాలో సినీ రంగ ప్రముఖులు షారుక్‌ ఖాన్, అల్లు శిరీష్, పూజా హెగ్డే,  బొమన్‌ ఇరానీ, శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ తో పాటు క్యూనెట్‌ కంపెనీ సీఈవోలు, డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్లు, ప్రమోటర్లు, బాలీవుడ్, టాలీవుడ్‌ తారలు, క్రికెటర్లు దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు క్యూనెట్‌ ఫ్రాంచైజీ విహన్‌ డైరెక్ట్‌ సెలింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదైన 14 కేసుల్లో దాదాపు 60 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 
వీరంతా గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వీరిచ్చే సమాచారం ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు చేపడతారు. బెంగళూరుకు చెందిన విహన్‌ డైరెక్ట్‌ సెలింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మందిని మోసగించినట్లుగా తెలుస్తోందని, దర్యాప్తు పూర్తయితే ఇంకా ఎంత మందిని, ఎంత మొత్తంలో మోసం చేశారన్న విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకుపైగా మోసం చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు.

Related posts