telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎట్టకేలకు మాటపై నిలబడ్డ ఆర్జీవీ..

‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనేది పూరి జగన్నాథ్ ‘పోకిరి’ సినిమాలో మహేశ్ బాబు కోసం రాసిన డైలాగ్! కానీ పూరి తన గురువు రామ్ గోపాల్ వర్మను దృష్టి పెట్టుకుని ఈ డైలాగ్ ఎప్పుడో రాసి పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. నిజమే! వర్మ ఎప్పుడూ తన మాట తనే వినడు. పైగా ‘అలా వినేట్టయితే వర్మ ఎందుకు అవుతాడు?’ అని ఎదురు ప్రశ్నిస్తాడు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడు మాత్రం వర్మ తన మాట నిలబెట్టుకున్నాడు. కరోనా సమయంలోనే అతి తక్కువ సిబ్బందితో ‘కరోనా వైరస్’ మూవీని నిర్మించిన వర్మ… థియేటర్‌ రీ-ఓపెన్ కాగానే మొదట దీనిని విడుదల చేస్తానని ప్రకటించాడు. మొత్తానికి ఆ మాటను నిలబెట్టుకుంటున్నాడు. అయితే… ఇందులో కూడా చిన్న మెలిక ఉంది. తెలంగాణాలో థియేటర్లు డిసెంబర్ 4న ఓపెన్ అయ్యాయి. మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు సింగిల్ థియేటర్లలోనూ ‘టెనెట్’ తెలుగు, హిందీ డబ్బింగ్ వర్షన్స్ ప్రదర్శితమయ్యాయి. అయితే… అన్ లాక్ తర్వాత థియేటర్లలో రిలీజ్ కాబోతున్న స్ట్రయిట్ తెలుగు సినిమాగా వర్మ ‘కరోనా వైరస్’ నిలువబోతోంది. వంశీ చాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అగస్త్య మంజు డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ డిసెంబర్ 11న జనం ముందుకు రాబోతోంది.

Related posts