telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ పుర్వవైభవానికి.. ఎన్టీఆర్‌ రావాల్సిందేనా..!

హైదరాబాద్ మహానగర సంస్థకు డిసెంబర్ 1న జరిగిన ఎన్నికల ఫలితాలు చూశాక, ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకు పోయినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, 1983 జనవరి 5న తొలిసారి రాజ్యాధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఆ తరువాత దాదాపు 18 ఏళ్ళ పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడిపింది. ఈ సమయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యన్.టి.రామారావు తీసుకున్న పలు నిర్ణయాలు తెలుగువారిని విశేషంగా ఆకర్షించాయి. పటేల్, పఠ్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత యన్టీఆర్ దే. అప్పటి దాకా తెలుగునేలపై ప్రతి గ్రామంలో మునసబు, కరణం పెత్తనం సాగుతూ వచ్చింది. దానికి అప్పటి రామారావు ప్రభుత్వం చరమగీతం పాడింది. ఈ మార్పు తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంది. దాంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్ల జనానికి విశ్వాసం కలిగింది. అదీగాక యన్టీఆర్ ప్రభుత్వం ఎంతోమంది కొత్తవారిని ప్రోత్సహించింది. అందులోనూ బలహీన వర్గాలవారికి దన్నుగా నిలచింది. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీ అనగానే బలహీన వర్గాల పార్టీ అన్న పేరు సంపాదించింది. దాంతో తెలంగాణలో బలమైన క్యాడర్ గల పార్టీగా తెలుగుదేశం నిలచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగక ముందు వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గణనీయమైన ఓట్లనే పోగు చేసింది. యన్టీఆర్ నాయకత్వంలో పార్టీ జయకేతనం ఎగురవేసిన ప్రతీసారి గణనీయమైన సీట్లూ లభించాయి. 2004లో చంద్రబాబు నాయుడు ఓటమి సమయంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత పార్టీ అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో తెలంగాణ వాసులను ఆకట్టుకోలేక పోయింది. అయితే మధ్యలో 2009లో చంద్రబాబు, చంద్రశేఖర్ రావు పొత్తులో కూడా పార్టీకి ఓటింగ్ శాతం మెరుగ్గానే ఉంది.

రాను రాను… తగ్గుతున్న బలం…
విభజన తరువాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 15 సీట్లు సంపాదించింది. 2018 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకు, అదీ ఖమ్మం జిల్లాలోనే ఆ రెండు సీట్లు రావడం జరిగింది. ఇక హైదరాబాద్ నగరంలో అంతకు ముందు తెలుగుదేశం పార్టీ సీమాంధ్రులు ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉండేది. ఆ బలం 2014 ఎన్నికల్లోనూ కనిపించింది. అయితే 2018 ఎన్నికల్లో ఆ బలం కనిపించలేదు సరికదా, ఆ పార్టీ నగరంలో పట్టున్న స్థానాలను సైతం భారీ తేడాతో చేజార్చుకుంది. 2016లో జరిగిన హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికల్లోనూ ఒకే ఒక్క కేపీహెచ్.బీ కార్పోరేటర్ ను మాత్రమే దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఈ సారి 106 కార్పోరేట్ స్థానాలకు పోటీ చేసినా, ఒక్క సీటునూ సంపాదించలేకపోయింది. తెలంగాణలో ఎంతో కేడర్ ఉన్న పార్టీగా పేరొందిన తెలుగుదేశం ఇంత ఘోరపరాజయాన్ని చవిచూడడం పార్టీ అభిమానులకు బాధ కలిగిస్తూనే ఉంది. ఇప్పటికీ వాళ్ళు ఏదో ఒకరోజున తెలుగుదేశం మళ్ళీ పూర్వవైభవం చూస్తుందనే విశ్వాసంతోనే ఉండడం గమనార్హం!

నాయకత్వలోపమే అసలు కారణం!
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఊపిరి పోసుకోవడం కల్ల అని అందరూ అంటున్నారు. అయితే పార్టీ అభిమానులు మాత్రం ఘోరపరాజయాలకు నాయకత్వ లోపమే కారణమని చెబుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, అమరావతి అంటూ పరుగులు తీయడంతో టీడీపీ క్యాడర్ బలహీనపడడం మొదలెట్టిందని అభిమానుల మాట . క్యాడర్ రోజురోజుకూ తగ్గుతున్న సమయంలోనూ చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. పైగా, ఇక్కడి తెలుగుదేశం నాయకులే పోటీకి దూరంగా ఉంటూ ఇతరులకు సీట్లు ఇచ్చి, తాము చేతులు దులుపుకోవడంతో పార్టీ క్యాడర్ కు కూడా నాయకులపై నమ్మకం పోయింది. చంద్రబాబు ఎక్కువ సేపు వీడియో కాన్ఫరెన్సులలోనే ‘తమ్ముళ్ళూ మీరేం భయపడకండి… ‘ అంటారే తప్ప ప్రత్యక్షంగా పార్టీ శ్రేణులతో మాట్లాడింది తక్కువే. మిగతా నియోజక వర్గాలలో కన్నా హైదరాబాద్ మహానగరంలో పార్టీ కంచుకోటలు అనుకున్నవి కూలిపోయాయి. మరో విషయం ఏమంటే, పార్టీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలలో సీమాంధ్ర జనం అధికంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లా పూర్, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోని కార్పోరేటర్లలో సింహభాగాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం గమనార్హం. అంటే సీమాంధ్రులు అధికంగా ఉన్న ఈ ప్రాంతాలలోనూ తెలుగుదేశం ను కాదని టీఆర్ఎస్ కు ఓటు వేశారంటే, నాయకత్వ లోపమే అసలు కారణమని పార్టీ అభిమానుల మాట.

జూనియరే రావాలా!?
మరి పార్టీ తెలంగాణలో బలపడాలంటే, ఏం చేయాలి? అధిక సంఖ్యాకులైన తెలుగుదేశం పార్టీ అభిమానుల మాట యన్టీఆర్ ఫ్యామిలీలోని వారే ఇక్కడ పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. మొన్న చంద్రబాబు 2018 ఎన్నికల్లో హరికృష్ణ కూతురు సుహాసినిని కూకట్ పల్లిలో నించోబెట్టినా ఘోరపరాజయం తప్పలేదు. మరి నందమూరి కుటుంబసభ్యులు వస్తే లాభమేంటి అన్న మాటా వినిపిస్తోంది. నందమూరి కుటుంబంలోనూ జనాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న జూనియర్ యన్టీఆర్ లాంటివాళ్ళు వస్తేనే పార్టీ ఇక్కడ బతికి బట్టకలుగుతుందని అభిమానుల భావన. ఎందుకంటే జూనియర్ యన్టీఆర్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. అదీగాక, అతనికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అతను ఒక్కసారి వచ్చి జనం ముందు నిలుచుంటే చాలు, కథ వేరుగా ఉంటుందనీ అంటున్నారు. నందమూరి ఫ్యామిలీలో పార్టీని బతికించగల సత్తా ఒక్క జూనియర్ కే ఉందని అధిక సంఖ్యాకులు భావిస్తున్నారు. జూనియర్ ను పార్టీలోకి రానీయకుండా, చంద్రబాబు, ఆయన తనయుడు స్కెచ్ వేసుకుంటూ సాగుతూ ఉంటే, పార్టీ కాలగర్భంలో కలిసిపోక తప్పదనీ అభిమానులు అంటున్నారు. మరి, ఈ విషయంలో జూనియర్ ఏమంటాడో చూడాలి. “తానింకా సినిమాల్లో నటిస్తున్నాను, తనకు సినీరంగంలో ఎంతో భవిష్యత్ ఉంది, ఇప్పట్లో రాజకీయాల్లోకి రాను” – లాంటి మాటలు మాట్లాడితే మునుముందు అతను వచ్చినా, ఆదరించేవారు ఉండరనీ కొందరి మాట. మరి తెలంగాణలో తెలుగుదేశం ఏమవుతుందో!?

Related posts