telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటకీయం : .. ప్రభుత్వం మారడానికి .. 5 వేల కోట్ల ఖర్చు..

prakash karat on karnataka politics

కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు పతనం అవడంతో..ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యెడియూరప్ప గవర్నర్‌ను కలిశారు. అందుకు ఆయన సమ్మతించడంతో రాష్ట్రంలో బీజేపీ సర్కారు మరోసారి కొలువుదీరిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌కారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ప్రభుత్వం కూల్చడంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే 16 మంది కోటీశ్వరులయ్యారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలు బీజేపీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చాయన్న కారత్‌.. గత ఎన్నికల్లో బీజేపీ రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను కేవలం ఎన్నికల ద్వారా ఎదుర్కోలేం. సైద్ధాంతికంగా పోరాటం చేయాలి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే లౌకిక తత్వానికి మద్దతివ్వాలి. హిందూ మతానికి ప్రమాదమంటూ బీజేపీ హిందువులను కూడగట్టి రాజకీయం చేస్తోంది’ అని అన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు.డబ్బులతో ప్రతిపక్షాల సభ్యులను బీజేపీ కొనుగోలు చేస్తోందని అన్నారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలను డబ్బుతోనే బీజేపీ కొనుగోలు చేసిందన్నారు.తమది లౌకికవాద పార్టీ అని చెప్పే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ.. గత ఎన్నికల్లో గుళ్లూ గోపురాలు తిరిగారని విమర్శించారు.

కొత్త సీఎం గా యడ్యూరప్ప (75) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ వాజూభాయ్ వాలా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం అసెంబ్లీలో యడ్యూరప్ప మెజార్టీని నిరూపించుకోనున్నారు. సంఖ్యాశాస్త్రంపై నమ్మకంతో ప్రమాణ స్వీకారానికి ముందే యడ్యూరప్ప తన పేరులోని అక్షరాలను మార్చుకోవడం గమనార్హం. దీంతో ఆయన పేరు యడ్యూరప్ప కాస్త యెడియూరప్పగా మారింది. శుక్రవారం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేశారు. మంత్రివర్గంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని యడ్యూరప్ప తెలిపారు. ప్రమాణస్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు వరాలు ప్రకటించారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇస్తున్న రూ.6 వేలకు అదనంగా మరో రూ.4000 అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే చేనేతల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నట్లు ప్రకటించారు.

Related posts