telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు… చిరు, మోహన్ బాబు, రాజమౌళి

Jayaprakash-Reddy

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. లాక్‌డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన ఈ ఉదయం స్నానాల గదిలో ఒక్కసారి కుప్పకూలాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. జ‌య‌ప్ర‌కాశ్‌ రెడ్డి మ‌ర‌ణం పట్ల సీనియర్‌ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పదిమందికి సహాయం చేయాలనుకునే మంచి వ్యక్తి అని, లక్ష్మీ పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మించిన సినిమాల్లో ఆయన ఎన్నో మంచి పాత్రలు పోషించారని జయప్రకాశ్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసు​కున్నారు. “జయప్రకాశ్‌ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. జయప్రకాశ్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను” అని మోహన్‌బాబు పేర్కొన్నారు.

జయప్రకాశ్ రెడ్డి మృతిపై చిరంజీవి స్పందిస్తూ “సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాష్‌ రెడ్డి గారితో నేను ఆఖరిగా చేసింది ఖైదీ నెంబర్‌ 150 సినిమాలో. ఆయన గొప్ప నటుడు. నాటకరంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి అనే వారు. అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకోనండి, స్టేజీ మీద పర్ఫామెన్స్‌ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి అని అడిగేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అంటే మొదట గుర్తువచ్చేది జయప్రకాశ్‌ రెడ్డి గారే. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదిగకా నివాళులు అర్పించారు.

జయప్రకాష్‌ రెడ్డి మృతి పట్ల ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఆకస్మిక మరణ వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. విషాదకరం. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతుల్ని మిగిల్చింది. విలక్షణ నటన, మీదైన కామెడీ, విలనిజంతో దశాబ్దాల తరబడి మాకు వినోదం పంచినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ప్రార్థించారు.

తెలుగు సినీ రంగంలో తనదంటూ ఒక నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలాది ప్రేక్షకుల మన్ననలు పొందిన విలక్షణ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగఢ సానుభూతి తెలిపారు. రంగ స్థల నటుడిగా ప్రస్థానం ప్రారంభించి దాదాపు వందకు పైగా చలన చిత్రాలలో నటించి, నాటక సినీ రంగంలో జయప్రకాశ్ రెడ్డి ఒక సంచలనం సృష్టించారని ఆయన చెప్పారు. 

Related posts