telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

శాస్త్ర పరిశోధనల రంగాన్నీ .. అందరు కలిసి కాపాడుకోవాలి.. : శాస్త్రవేత్త వికాస్‌ సిన్హా

ప్రముఖ శాస్త్రవేత్త వికాస్‌ సిన్హా ప్రభుత్వం శాస్త్ర పరిశోధనల రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని, కార్పొరేట్‌ సంస్థలు కూడా తమ వంతు సాయం అందించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసే స్థితిలో లేరు. వీరంతా అత్యున్నత స్థాయి గుమాస్తాల తీరులో తమకు తాము భద్రంగా వుంటే చాలనుకుంటున్నారు. జగదీష్‌ చంద్రబోస్‌, మేఘనాధ్‌ సాహా, సత్యేన్‌ బోస్‌, సి.వి రామన్‌, హోమీ బాబా, రాజా రామన్న వంటి వారి సాహస స్ఫూర్తి ప్రస్తుత శాస్త్రవేత్తలకు లేదు. ప్రస్తుతం శాస్త్ర పరిశోధనల రంగం తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకు పోయిందని నేను భావిస్తున్నాను.

శాస్త్ర పరిశోధనలకు జపాన్‌ ప్రభుత్వం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో నాలుగు శాతం, అమెరికా, జర్మనీ ఐదు శాతం ఖర్చు పెడుతున్నాయి. భారత్‌ దశాబ్దాల తరబడి ఒక శాతానికే పరిమితమైంది. ఇంత నామమాత్రంగా వున్న ప్రభుత్వ సాయంతో పరిశోధనలు ముందడుగు వేయటం కష్టం. కొత్త ప్రభుత్వమైనా ఈ రంగానికి మరిన్ని కేటాయింపులు చేయాలి. భారత్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, వాటికి సంబంధించిన పేటెంట్‌ హక్కులకు గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో స్థానం కల్పించాలంటే దేశంతో పాటు విదేశాల్లోనూ వీటికి డిమాండ్‌ పెంచాలి. ఈ దిశలో ఇస్రో కొంత మేర విజయం సాధించింది.

భారత అణుశక్తి సంస్థ, శాస్త్ర, సాంకేతిక విభాగం, శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి వంటి సంస్థలు ఇంకా వెనుకబడే వున్నాయి. వీటికి ప్రపంచ స్థాయి దృక్పథం అలవడలేదు. పరిశోధనల్లో వినూత్నత కొరవడింది. జి.డి.పిలో ఒక శాతం కన్నా తక్కువ కేటాయింపుల విధానాన్ని బద్దలు కొట్టాలని ప్రధానిని కోరుతున్నాం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ను నిజమైన గ్లోబల్‌ లీడర్‌గా చేసేందుకు కృషి చేయాల్సిన అధికారులు, సాంకేతిక నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీనిని భర్తీ చేయాలి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ప్రధాని చెబుతున్న సత్వర ఆర్థిక ప్రగతి సాధ్యం కాదు అని సిన్హా అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related posts