సాగునీటి ప్రాజెక్టుల అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రభుత్వం గుర్తించిన “పోలవరం”ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రైతులు, సాగునీటి సంఘాల నాయకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు సందర్శించేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా పర్చూర్ మండలంలోని అన్నంబొట్లవారిపాలెం గ్రామం నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్ ల ఆధ్వర్యంలో రెండు బస్సుల్లో రైతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించారు.
పోలవరం సందర్శన ఎంతో అనుభూతిని కలిగించదని, ఈ టూర్ విహార యాత్రను తలపించదని రైతులు, విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇంత గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం ప్రతి జిల్లాకు రూ.1.73 కోట్లు నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది. దీంతో ప్రాజెక్టుల పనితీరుపై పూర్తి అవగాహన పెంచుకోవడంకు ఈ చర్య ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ విధంగా పోలవరం సందర్శన కోసం రైతులు,విద్యార్థులను తీసుకెళ్లే విషయంపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల సర్కిల్ కార్యాలయాల ఎస్‌ఈలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలవరానికి సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రం నలుమూల నుంచి ప్రతి రోజు అధిక సంఖ్యలో రైతులు, విద్యార్థులతో పాటు సాగునీటి సంఘాల నాయకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.