కర్నాటక విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమిపాలై తన సీఎం పదవికి రాజీనామా చేసీన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ రైతు కుమారస్వామి ఓటమిని జీర్ణించుకోలేక పోయాడు. కుమారస్వామిపై అత్యంత వీరాభిమాని అయిన రైతు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది.
కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయడాన్ని భరించలేని రైతు తన ఎకరం పొలంలోని సర్వే తోటను నరికేశాడు. అనంతరం దానిని వీడియో తీసి చూపిస్తూ, కుమారస్వామి రాజీనామా తనను ఎంతలా కుంగదీసిందో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమారస్వామి అభిమానులెవరూ ఇలాంటి నిర్ణయాలతో ఆయనను మరింత బాధ పెట్టవద్దని ఈ క్రమంలో కొందరు నేతలు సూచిస్తున్నారు.