గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దాదాపు 200 గ్రామాలు, లంకలు నీట మునిగాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆయా కేంద్రాల్లో పసిపిల్లలకు పాలు కూడా అందడంలేదని వెల్లడించారు.
వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేరని అన్నారు. పసిబిడ్డలకు పాల కోసం అడిగితే పాలు అత్యవసర వస్తువుల జాబితాలో లేవన్న నిర్లక్ష్యపూరితమైన సమాధానం అధికారుల నుంచి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పాలను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి పసిబిడ్డల ఆకలి తీర్చాలని పవన్ విజ్ఞప్తి చేశారు.