ఇటీవల కేంద్రం పెరిగిన ఫైన్‌ల చిట్టాను విడుదల చేసింది. ఈ భారీ జరిమానాలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ రోజు నుంచి నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని ట్రాఫిక్ అధికారులు ఇప్పటికే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొత్త వాహన చట్టం ప్రకారం పాత చలానాలు రెట్టింపు అవుతాయి. అటు పాత చలానాలు కొత్త చలనాల అమౌంట్‌కి ఆటోమేటిక్‌గా మారిపోయని చెబుతూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ‘వాహనదారులకు విజ్ఞప్తి..! మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలు ఈ నెల ఆఖరులోగా అనగా 31-08-2019 నాటికీ చెల్లించండి. లేనిచో 01-09-2019 నుండి కొత్త చట్టం ప్రకారం సాఫ్ట్‌వేర్ అప్డేషన్ అయిన వెంటనే పాత జరిమానాలు అన్ని ఆటోమేటిక్‌గా కొత్త ధరలతో రెట్టింపు చేయబడననిఅంటూ వార్త నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రకటనను తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విడుదల చేసినట్లుగా కూడా సదరు వార్తలో ఉంది. దీనిపై తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ తాజాగా స్పష్టమైన ప్రకటనను విడుదల చేశారు. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సెప్టెంబర్ 1వ తేదీలోపు చెల్లించకపోతే కొత్త చట్టం ప్రకారం జరిమానాలు పెరగవని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని వెల్లడించారు. సెప్టెంబర్ 1 తర్వాత అమల్లోకి వచ్చే చట్టం ప్రకారం రూల్స్‌ను అతిక్రమిస్తే భారీ జరిమానాలు కట్టక తప్పదని మరోసారి వాహనదారులను హెచ్చరించారు.