జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు తెలుపుతున్నామని అన్నారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు జమ్ముకశ్మీర్ ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. డెబ్బై ఏళ్ల క్రితం జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిచేశారని అన్నారు. దీంతో జమ్ముకశ్మీర్ కు కొత్త శకం ఆరంభమైందని చెప్పారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం పేరుతో కశ్మీర్ ను భారత్ లో పూర్తి స్థాయిలో విలీనం చేశారంటూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
కశ్మీర్ స్వయంప్రతిపత్తిని దుర్వినియోగం చేశారని గత పాలకులపై విమర్శలు చేశారు.ఇన్నేళ్లూ జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అక్కడ హింసాత్మక చర్యలు పెరిగాయే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. జమ్ముకశ్మీర్ సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రం స్పష్టం చేయాలని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో వీలైనంత త్వరలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నామని జయదేవ్ అన్నారు.