telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జ‌గ‌న్ స‌ర్కార్‌కు వారం గ‌డువిచ్చిన జ‌న‌సేన‌

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ సర్కార్ వారంలోగా స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వానికి వారం గడువు ఇస్తున్నామని, లేద‌ని మీకు గడ్డుకాలమే అంటూ హెచ్చరించారు. ఇప్పటి వరకు చెప్పింది చాలు.. చాలా విన్నాం…! ఇంకా మా చెవుల్లో క్యాబేజీలు పెట్టకండి అంటూ పంచ్‌లు విసిరారు పవన్.

ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ఎవ్వరూ ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడరని అలాంటప్పుడు ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. వైసీపీ మాటలకు అర్థాలు వేరులే. వైసీపీ మాటలన్నీ ఆచరణలోకి రాని మాటలు. జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రా వాళ్లకి ఏదీ మనది అనిపించదా?. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడుతామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలి.’’ అని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

చెప్పినమాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత సంకల్పం. అన్ని పరిశ్రమలు, సంస్థలకు నష్టాలు, అప్పులు ఉన్నాయి.. ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అన్నారు జనసేనాని. సొంత గ‌నులు కేటాయిస్తే విశాఖ స్టీల్‌కు న‌ష్టాలు త‌గ్గుతాయ‌ని అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గ‌నులు కేటాయించాల‌ని ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడ‌గ‌ర‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రశ్నించారు.

త‌న‌కు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే బ‌లం కూడా లేదు, గెలిచిన ఒక్క ఎమ్మెల్యేనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప‌ట్టుకుపోయారని చెప్పారు. కానీ విశాఖ స్టీల్ ప్రైవేటీక‌రించొద్ద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశామ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.ప్రజాబలం ఉంది కనుకనే అమిత్‌షా అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ఎవ్వరూ ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడరని అలాంటప్పుడు ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు.

నా సభలకు జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం వాళ్లకు వేస్తారు. మీకు వైసీపే కరెక్ట్ అంటూ సభకు వచ్చిన జనాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్. గతంలో తాను.. పోరాటం చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. గతంలో పోరాటం చేయడం వల్లనే కేంద్రంలో ఉన్న పెద్దలకు శత్రువునయ్యానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రజలే పోరాటం చేయాలి.. వారి వెనుక నేను.. నిలబడతానంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Related posts