telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కెనడా ప్రధాని భార్యకు కరోనా పాజిటివ్…! 

canada

చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రస్తుతం 124 దేశాలకు వ్యాప్తిచెందింది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా 4,600 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, లక్షా 30వేల మందికి వైరస్ సోకింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, తాజాగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఓ కార్యక్రమంలో ట్రుడో దంపతులు పాల్గొనగా.. అనంతరం సోఫీ గ్రెగోర్‌లో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ ఉన్నట్టు తేలిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొంది. భార్య కరోనా బారినపడటంతో కెనడా ప్రధాని ట్రుడో తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల సలహాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రూడో కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ కామెరూన్‌ అహ్మద్‌ వెల్లడించారు. కాగా, ట్రుడోకు కరోనా లక్షణాలు లేవని నిర్ధారించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా క్రీడా, వినోద ఈవెంట్లను రద్దు చేశారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితిలో ఫిలిప్పైన్స్ రాయబారికి కూడా కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. న్యూయార్క్‌లోని యూఎస్ ప్రధాన కార్యాలయంలో నమోదైన తొలి కేసు ఇదే. మహిళా రాయబారికి కరోనా వైరస్ సోకినట్టు ఈ మేరకు ఐరాస ఓ నోట్ ప్రచురించింది.

Related posts