telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయండి… జాన్వీకపూర్ కు షాకిచ్చిన జాతీయ మహిళా కమిషన్

Gunjan

జాన్వీకపూర్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషించింది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నెటిజన్ల ముందుకు ఈ చిత్రం వచ్చింది. ది కార్గిల్‌ గర్ల్‌గా పేరొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అయితే ఈ సినిమా విషయంలో జాన్వీకి తలనొప్పులు మొదలయ్యాయి. గుంజన్ సక్సేనా సినిమా మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. చిత్రంలో వాయుసేనను కించపరుస్తూ అనేక సన్నేవేశాలున్నాయని ఐఏఎఫ్ ఇటీవల సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. మాజీ పైలట్ గుంజన్ సక్సేనా కూడా ఐఏఎఫ్‌కు అనుకూలంగానే మాట్లాడారు. తాను వాయుసేనలో ఉద్యోగం చేసేటప్పుడు పురుషులతో సమానమైన అవకాశాలు లభించేవని, పై అధికారులు కూడా తనకు ఎంతో అండగా ఉన్నారని ఆమె తెలిపారు. దీంతో సినిమా తెరకెక్కిన విధానంపైనే విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఓ పెద్ద షాక్ ఇచ్చింది. వాయుసేనను కించపరుస్తూ తీసిన ఈ సినిమాను ప్రదర్శించవద్దని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ దీనిపై ఓ ట్వీట్ చేశారు. ‘మన సేనలపై మనమే అసత్య ప్రచారం ఎందుకు చేయాలి..? వాటి ప్రతిష్ఠను దెబ్బ తీసేలా తక్కువ చేసి ఎందుకు చూపించాలి..? వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయండి. అంతేకాకుండా వాయుసేనకు చిత్ర నిర్మాతలు క్షమాపణ చెప్పాలి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే దీనిపై చిత్ర బృందం ఏమంటుందో చూడాలి.

Related posts