ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
‘ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆయన గొప్ప సంపద అని తమిళిసై అన్నారు. భారత్‌కు మోదీ మరిన్ని గొప్ప సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు.
‘భారతమాత ఖ్యాతిని ఖండాంతరాల వరకూ విస్తరింపజేస్తూ, నవభారత నిర్మాణంలో నిత్య కృషీవలుడిగా, సుదీర్ఘకాల సమస్యలను సున్నితంగా పరిష్కరించిన సుసాధ్యుడు, భారత మాత ముద్దుబిడ్డ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు’ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
‘ప్రధాని మోదీకి 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు దేశానికి మరిన్ని ఏళ్లపాటు సేవలు అందించేందుకు మీకు దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను’ అని సినీనటుడు చిరంజీవి పేర్కొన్నారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి మా నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.