ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో విడత పూర్తయింది. అయితే.. ఈ రెండో విడతలో టీడీపీ బాగానే పుంజుకుంది. ఏకంగా కొడాలి నాని స్వంత గ్రామంలోనే వైసీపీ పరాజయం చవి చూసింది. రెండో విడతలోనూ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికల్లో అక్రమాలపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని లోకేష్ ఆరోపించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా… టీడీపీ హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. అంతేకాదు…వచ్చే 3, 4 విడతల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేయకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు లోకేష్. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాత జాగీరులా విర్రవీగుతోన్న జగన్‌రెడ్డి వైసీపీ మద్దతుదారులు 95 శాతం పంచాయతీలలో ఏకగ్రీవంగా గెలవాలని టార్గెట్ పెట్టారు. తొలివిడతలోనే తెలుగుదేశం సైన్యం ఎదురొడ్డి పోరాడి జెండా ఎగరేసింది. టిడిపి అభిమాని నుంచి అధ్యక్షుడి వరకూ పడిన కష్టానికి ప్రతిఫలం ఈ సానుకూల ఫలితాలు.బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం, చంపేస్తామని హెచ్చరించి విత్‌డ్రా చేయించడమూ విజయమేనా జగన్ రెడ్డి! జనం ఇంకా వైకాపా వైపే ఉన్నారని మీకు నమ్మకం వుంటే.. దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా 3,4 విడతల్లో పోటీ చేయండి. ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది.” అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు.
previous post