telugu navyamedia
క్రీడలు వార్తలు

మాల్దీవ్స్‌ బార్‌లో తాగి కొట్టుకున్న ఆసీస్ ప్లేయర్స్…

కరోనా దెబ్బతో ఐపీఎల్ 2021 వాయిదా పడటం, భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషేధం ఉండటంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కామెంటేటర్లు మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి బార్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆసీస్ మాజీ క్రికెట్ మైకేల్ స్లేటర్ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లుగా ది డైలీ టెలి గ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. ఈ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు అయినా, తాగిన మైకంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లిందని పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్‌లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. అయితే ఈ కథనాన్ని ఈ ఇద్దరు క్రికెటర్లు ఖండించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, అన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. నిజనిజాలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు కథనాన్ని ఎలా రాస్తారని పత్రికపై మండిపడ్డారు. దీనిపై మొదటగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్‌ఫీల్డ్‌కు ఓ మెసేజ్ పంపించాడు. ‘ఇదంతా పుకారే. వార్నర్‌, నేను మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు.’అని స్లేటర్ ఆ సందేశంలో స్పష్టం చేశాడు. ఆ తర్వాత వార్నర్ కూడా టెక్ట్స్ మెసేజ్ పంపించాడు. ‘మా మధ్య ఎలాంటి గొడవ, డ్రామా జరగలేదు. మీకు ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మీరు అక్కడ ఉండి లేదా బలమైన ఆధారం ఉంటేనే రాయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా రాస్తారు? అసలు అక్కడ ఏమీ జరగలేదు’అని వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Related posts