దేశంలో ఆర్థిక మందగమనం గురించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లేనని గాంధీ జయంతి రోజున విడుదలైన మూడు బాలీవుడ్ చిత్రాలు రూ.120 కోట్ల కలెక్షన్ దక్కించుకున్నాయని, దీనిని బట్టే ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తనదైన వాదన వినిపించారు. ఆయన మాటల్లో.. ‘అక్టోబర్ 2న మూడు సినిమాలు విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో ఒకే రోజు రూ.120 కోట్లు కలెక్షన్ వచ్చినట్లు సినిమా ఎనలిస్ట్ కోమల్ నహతా చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పటిష్టత వల్లే ఇంత మొత్తంలో వ్యాపారం జరిగింది’ అని రవిశంకర్ మీడియా ముందు వెల్లడించారు.
ఓవైపు రవిశంకర్ ప్రసాద్ దేశంలో ఆర్థిక మందగమనం లేదని చెప్పుకొస్తుండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మందగమన పరిస్థితులపై ఆయా రంగాల నుంచి క్రమం తప్పకుండా ప్రయత్నాలు సాగిస్తున్నామని మరో సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరించేందుకు కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గించామని ఆమె వివరించారు.